translateexpand_more

Grain Procurement News

Latest updates from Telugu Digital news sources.

Namasthe Telangana03 Jun, 07:30 am
కల్లాల్లోనే ధాన్యం, రైతుల కళ్లల్లో కన్నీరు.. పట్టించుకోని ప్రభుత్వం

బచ్చన్నపేట జూన్ 3 : రైతు ప్రభుత్వమని గొప్పలు చెప్పుకుంటున్న రేవంత్ రెడ్డి సర్కార్.. రైతులు కష్టపడి పండించిన పంటను కొనుగోలు చేయడంలో పూర్తిగా విఫలమైందని మాజీ సర్పంచుల ఫోరం జనగామ జిల్లా ఉపాధ్యక్షులు గంగం సతీష్ రెడ్డి, బచ్చన్నపేట మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు ఎండీ ఫిరోజ్‌ ఆరోపించారు. బుధవారం బచ్చన్నపేట మండల కేంద్రంలో బీఆర్ఎస్ నాయకులతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు. మండలంలోని 26 గ్రామ పంచాయతీల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రెండు నెలలు గడుస్తున్నప్పటికి ఇంతవరకు ధాన్యాన్ని పూర్తిస్థాయిలో మిల్లర్లకు తరలించకపోవడం దారుణమన్నారు. ఐకెపి, పిఎసిఎస్ కేంద్రాలు, కల్లాల్లో ధాన్యం రాశులు కుప్పలు కుప్పలుగా పేరుకుపోయి ఉన్నా పాలకులు, అధికారులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ రైతాంగం ధాన్యం అమ్ముకోలేక అల్లాడుతుంటే, వారి బాధలను తీర్చాల్సిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆంధ్రా పెత్తందారుల విగ్రహాల ఓపెనింగ్‌కు వెళ్లడం సిగ్గుచేటన్నారు. అన్నదాతల కష్టాల కంటే సీఎంకు అవే ఎక్కువయ్యాయా అని నిలదీశారు. మరో వైపు వర్షాకాలం ముంచుకొస్తుండటంతో కల్లాల్లోని ధాన్యం ఎక్కడ తడిసి ముద్దవుతుందోనని రైతులు రాత్రి పగలు కంటిమీద కునుకు లేకుండా కాపలా కాస్తున్నారని నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రకృతి కన్నెర్ర జేస్తే రైతులు పూర్తిగా నష్టపోయే ప్రమాదం ఉందని, తక్షణమే ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రైతులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు ముసిని రాజు గౌడ్, జూకంటి కిష్టయ్య, మహమ్మద్ షబ్బీర్, జూల నరసింహ, ఆరె సతీష్ గౌడ్, గడ్డం అచ్చయ్య, తదితరులు పాల్గొన్నారు.