
ఇంటర్నెట్‌డెస్క్: ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ఫైర్ అయినట్లు తెలుస్తోంది. తాను లేకపోతే ఇప్పటికే జైల్లో ఉండే వాడివంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసినట్లు సమాచారం. లెబనాన్‌లోని హెజ్‌బొల్లాపై ఇజ్రాయెల్ సైనిక చర్యల విషయంపై నెతన్యాహును ట్రంప్ మందలించినట్లు అమెరికా అధికారిక వర్గాలను ఉటంకిస్తూ అక్కడి మీడియాలో కథనాలు వస్తున్నాయి. బీరుట్ దక్షిణ శివారు ప్రాంతాలను ఖాళీ చేయాలని అక్కడి ప్రజలను ఇజ్రాయెల్ సైన్యం హెచ్చరించింది. అయితే, లెబనాన్‌పై దాడులు చేస్తే అమెరికాతో చర్చల నుంచి వైదొలుగుతామని ఇరాన్ (Iran) బెదిరించింది. ఈ క్రమంలో నెతన్యాహు (Benjamin Netanyahu)తో ట్రంప్ ఫోన్‌లో మాట్లాడారు. టెల్‌అవీవ్ చర్యలు.. ఇరాన్‌తో దౌత్య ప్రయత్నాలను దెబ్బతీస్తున్నాయని, పశ్చిమాసియాలో ఉద్రిక్తతలను పెంచుతున్నాయని ట్రంప్ ఆందోళన వ్యక్తంచేశారనేది ఆ మీడియా కథనాల సారాంశం. ‘నువ్వు పిచ్చివాడివి. నేను లేకుంటే నువ్వు జైలులో ఉండేవాడివి. నేను నిన్ను కాపాడుతున్నా. ప్రస్తుతం అందరూ నిన్ను ద్వేషిస్తున్నారు. నీ చర్యల వల్ల ఇజ్రాయెల్‌ను కూడా ఇష్టపడటం లేదు’ అని నెతన్యాహుపై ట్రంప్ మండిపడినట్లు అవి పేర్కొన్నాయి. అదే సమయంలో ‘అసలు నువ్వు ఏం చేస్తున్నావు..?’ అంటూ ఇజ్రాయెల్ ప్రధానిపై ట్రంప్ గట్టిగా అరిచినట్లు వెల్లడించాయి. ఈ సందర్భంగా నెతన్యాహు నిర్ణయాలను కూడా ప్రశ్నించారని పేర్కొన్నాయి. ఆయన నిర్ణయాలతో ఉద్రిక్తతలు మరింత తీవ్రతరం అవుతున్నాయని, ఇజ్రాయెల్ (Israel) ప్రతిష్టను దెబ్బతీస్తున్నాయని ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిపాయి. ఒక హెజ్‌బొల్లా (Hezbollah) కమాండర్‌ను హతమార్చేందుకు టెల్‌అవీవ్ చేస్తున్న సైనిక చర్యల్లో అనేకమంది లెబనీస్ పౌరులు ప్రాణాలు కోల్పోవడంపై ఆందోళన వ్యక్తం చేసినట్లు కూడా వెల్లడించాయి. ఇక, నెతన్యాహుతో సానుకూలమైన సంభాషణ జరిగిందని ట్రంప్ తన ట్రూత్ సోషల్‌లో ఓ పోస్టు ద్వారా వెల్లడించారు. బీరుట్ వైపు ఇజ్రాయెల్ దళాలు వెళ్లవని హామీ ఇచ్చారు. ఈమేరకు హెజ్‌బొల్లా నాయకులతోను మాట్లాడినట్లు ట్రంప్ తెలిపారు. ఇజ్రాయెల్‌పై సైనిక కాల్పులను ఆపేందుకు వారు అంగీకరించినట్లు పేర్కొన్నారు. ఇజ్రాయెల్ కూడా వారిపై కాల్పులకు దూరంగా ఉంటుందని వెల్లడించారు. అయితే, నెతన్యాహు ప్రకటన ఇందుకు భిన్నంగా ఉంది. ఇజ్రాయెల్ నగరాలు, పౌరులపై దాడులు కొనసాగితే హెజ్‌బొల్లాను లక్ష్యంగా చేసుకుంటామని ఆయన పేర్కొన్నారు. ఈ విషయాన్ని ట్రంప్‌నకు కూడా తెలియజేసినట్లు పేర్కొన్నారు. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
