translateexpand_more

International News News

Latest updates from Telugu Digital news sources.

Eenadu02 Jun, 12:26 pm
ఆమెను 600 మంది రేప్ చేశారు’ - పాక్ ముఠాల ఆగడాలపై బ్రిటన్ ఎంపీ

ఇంటర్నెట్‌ డెస్క్‌: బ్రిటన్‌లో లైంగిక వేధింపుల ముఠాల (Grooming Gangs) అరాచకాలపై అక్కడి చట్టసభ మరోసారి చర్చించింది. అనేక రాష్ట్రాల్లో చిన్నారులు, మహిళల లైంగిక దోపిడీకి సంబంధించి స్వతంత్ర దర్యాప్తు నివేదికలోని సంచలన విషయాలను బాహ్య ప్రపంచం ముందుంచింది. వ్యవస్థీకృత ముఠాల వేధింపులు, అత్యాచారాలు, పోలీసులు వ్యవహరించిన తీరు, తదితర అంశాలపై బాధితులు, సాక్ష్యులు ఇచ్చిన వాంగ్మూలాలను కొందరు చట్టసభ సభ్యులు వివరించారు. అయితే, ఈ దారుణాలకు పాల్పడిన వారిలో ఎక్కువశాతం పాకిస్థాన్‌ (Pakistan) మూలాలున్న ట్యాక్సీ డ్రైవర్లు, వ్యాపారులే ఉన్నట్లు గతంలో తేలిన విషయం తెలిసిందే. బ్రిటన్‌ పార్లమెంట్‌ సభ్యుడు రూపెల్ట్‌ లోవ్ మాట్లాడుతూ.. ‘‘లైంగిక దాడులకు గురైన వారిలో ఎంతో మంది చిన్నారులు, మహిళలు ఉన్నారు. మైనర్‌గా ఉన్నప్పుడే తనపై లైంగిక దాడి జరిగిందని ఓ బాధితురాలు చెప్పింది. మూడేళ్లలో ఆమెపై 600-700 మంది అత్యాచారం చేసినట్లు ఆవేదన వ్యక్తం చేసింది. తన ప్రైవేటు భాగాలను తీవ్రంగా గాయపరిచినట్లు మరో మహిళ పేర్కొంది. బాధితులను జంతువుల్లా చూసినట్లు అనేక మంది చెప్పారు. శ్వేతజాతీయులనే లక్ష్యంగా చేసుకొని ఈ ముఠాలు లైంగిక హింసకు పాల్పడ్డాయని మరికొందరు బాధితులు వాంగ్మూలం ఇచ్చారు. కొందరు పోలీసు అధికారులు వ్యవహరించిన తీరుపైనా అనేక ఆరోపణలు ఉన్నాయి’’ అని వివరించారు. ఇలాంటి దురాగతాలను అడ్డుకునేందుకు చర్యలు తీసుకోవాలని చట్టసభ సభ్యులకు విజ్ఞప్తి చేశారు. నేను లేకపోతే జైల్లో ఉండేవాడివి.. నెతన్యాహుపై ట్రంప్‌ ఫైర్‌ బ్రిటన్‌లో లైంగిక వేధింపుల ముఠా అరాచకాల విషయం 2002లో తొలిసారి వెలుగులోకి వచ్చింది. పాకిస్థాన్‌ మూలాలున్న అనేక మంది.. దేశవ్యాప్తంగా కొన్ని వర్గాల అమ్మాయిలను లక్ష్యంగా చేసుకొని లైంగిక దాడులకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. సౌత్‌ యార్క్‌షైర్‌లో 2010లో కొందరు మైనర్‌ అమ్మాయిలను వేధించిన కేసులో పాక్‌ మూలాలున్న ఐదుగురు దోషులుగా తేలడం అప్పట్లో సంచలనం రేపింది. అనంతరం రోచ్‌డేల్‌, రోథర్‌హ్యామ్‌, ఓల్డ్‌హ్యామ్‌, టెల్ఫోర్డ్‌ తదితర ప్రాంతాల్లో జరిపిన దర్యాప్తులో ఈ వ్యవస్థీకృత ముఠాల దుర్మార్గాలు బయటపడ్డాయి. అయితే, చాలా కేసుల్లో పోలీసు అధికారుల పాత్ర కూడా ఉందని, బాధితుల ఫిర్యాదులపై సరైన చర్య తీసుకోలేదనే ఆరోపణలు ఉన్నాయి. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

Eenadu02 Jun, 03:32 am
మెటా ఏఐ బాట్ వాడి.. ఇన్ స్టాగ్రామ్ ఖాతాల హ్యాక్

ఇంటర్నెట్‌డెస్క్‌: మన వేలితో మన కన్నునే పొడవటం అంటే ఏమిటో టెక్‌ దిగ్గజం మెటాకు తెలిసొచ్చింది. దాని టూల్‌ను వాడి దాని సోషల్‌ మీడియా కంపెనీలోని హైప్రొఫైల్‌ ఖాతాలను హ్యాక్‌ చేశారు. మెటాకు చెందిన ఏఐ సపోర్ట్‌ చాట్‌బాట్‌ను వాడుకొని.. హ్యాకర్లు ఇన్‌స్టాగ్రామ్‌లోని హైప్రొఫైల్‌ ఖాతాలను హ్యాక్‌ చేశారు. ఈ విషయాన్ని సోమవారం మెటా కూడా అంగీకరించింది. తమ రీసెర్చర్లు ఈ లోపాలను బయటపెట్టాక వాటిని సరిచేసినట్లు వివరణ ఇచ్చింది. ఇన్‌స్టాగ్రామ్‌లో యూజర్లు తమ ఖాతాలను పునరుద్ధరించుకోవడానికి సాయం చేసేలా మెటా ఏఐ అసిస్టెంట్‌ను ఏర్పాటుచేసింది. దీనిని తప్పుదోవ పట్టించి ఇన్‌స్టా ఖాతాల్లో చొరబడవచ్చని జాక్‌ఎక్స్‌బీటీ, డార్క్‌ వెబ్‌ ఇన్ఫార్మర్‌ అనే సైబర్‌ భద్రతా నిపుణులు ఇటీవల బయటపెట్టారు. దీంతో ఈ విషయం సంచలనంగా మారింది. ఈ లోపం వల్ల ప్రభావితమైన ఖాతాల్లో అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా సమయంలో వాడిన వైట్‌హౌస్‌ ఖాతా, అమెరికా స్పేస్‌ఫోర్స్‌ చీఫ్‌ మాస్టర్‌ సార్జెంట్‌ జాన్‌ బెంటివెగ్నా, సౌందర్య ఉత్పత్తుల రీటైలర్‌ సెఫోరా ఖాతాలు ఉన్నాయి. హ్యాకర్లు టార్గెట్‌ చేసిన ఖాతాలను కొత్త ఈమెయిల్‌కు ఏఐ అసిస్టెంట్‌ సాయంతో లింక్‌ చేయించి.. వెరిఫికేషన్లు సంపాదించారు. తిరిగి ఆ కోడ్‌ వాడి సదరు ఖాతా పాస్‌వర్డ్‌ను రీసెట్‌ చేస్తున్నారు. దీంతో ఆ ఖాతా హ్యాకర్‌ అధీనంలోకి వెళుతోంది. అయితే ఈ సమస్యను తాము సరిచేసినట్లు తాజాగా మెటా వెల్లడించింది. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

Eenadu02 Jun, 03:19 am
నేను లేకపోతే జైల్లో ఉండేవాడివి.. నెతన్యాహుపై ట్రంప్ ఫైర్

ఇంటర్నెట్‌డెస్క్‌: ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహుపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ (Donald Trump) ఫైర్ అయినట్లు తెలుస్తోంది. తాను లేకపోతే ఇప్పటికే జైల్లో ఉండే వాడివంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసినట్లు సమాచారం. లెబనాన్‌లోని హెజ్‌బొల్లాపై ఇజ్రాయెల్‌ సైనిక చర్యల విషయంపై నెతన్యాహును ట్రంప్‌ మందలించినట్లు అమెరికా అధికారిక వర్గాలను ఉటంకిస్తూ అక్కడి మీడియాలో కథనాలు వస్తున్నాయి. బీరుట్‌ దక్షిణ శివారు ప్రాంతాలను ఖాళీ చేయాలని అక్కడి ప్రజలను ఇజ్రాయెల్‌ సైన్యం హెచ్చరించింది. అయితే, లెబనాన్‌పై దాడులు చేస్తే అమెరికాతో చర్చల నుంచి వైదొలుగుతామని ఇరాన్‌ (Iran) బెదిరించింది. ఈ క్రమంలో నెతన్యాహు (Benjamin Netanyahu)తో ట్రంప్‌ ఫోన్‌లో మాట్లాడారు. టెల్‌అవీవ్‌ చర్యలు.. ఇరాన్‌తో దౌత్య ప్రయత్నాలను దెబ్బతీస్తున్నాయని, పశ్చిమాసియాలో ఉద్రిక్తతలను పెంచుతున్నాయని ట్రంప్‌ ఆందోళన వ్యక్తంచేశారనేది ఆ మీడియా కథనాల సారాంశం. ‘నువ్వు పిచ్చివాడివి. నేను లేకుంటే నువ్వు జైలులో ఉండేవాడివి. నేను నిన్ను కాపాడుతున్నా. ప్రస్తుతం అందరూ నిన్ను ద్వేషిస్తున్నారు. నీ చర్యల వల్ల ఇజ్రాయెల్‌ను కూడా ఇష్టపడటం లేదు’ అని నెతన్యాహుపై ట్రంప్‌ మండిపడినట్లు అవి పేర్కొన్నాయి. అదే సమయంలో ‘అసలు నువ్వు ఏం చేస్తున్నావు..?’ అంటూ ఇజ్రాయెల్‌ ప్రధానిపై ట్రంప్‌ గట్టిగా అరిచినట్లు వెల్లడించాయి. ఈ సందర్భంగా నెతన్యాహు నిర్ణయాలను కూడా ప్రశ్నించారని పేర్కొన్నాయి. ఆయన నిర్ణయాలతో ఉద్రిక్తతలు మరింత తీవ్రతరం అవుతున్నాయని, ఇజ్రాయెల్‌ (Israel) ప్రతిష్టను దెబ్బతీస్తున్నాయని ట్రంప్‌ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిపాయి. ఒక హెజ్‌బొల్లా (Hezbollah) కమాండర్‌ను హతమార్చేందుకు టెల్‌అవీవ్‌ చేస్తున్న సైనిక చర్యల్లో అనేకమంది లెబనీస్‌ పౌరులు ప్రాణాలు కోల్పోవడంపై ఆందోళన వ్యక్తం చేసినట్లు కూడా వెల్లడించాయి. ఇక, నెతన్యాహుతో సానుకూలమైన సంభాషణ జరిగిందని ట్రంప్‌ తన ట్రూత్‌ సోషల్‌లో ఓ పోస్టు ద్వారా వెల్లడించారు. బీరుట్‌ వైపు ఇజ్రాయెల్‌ దళాలు వెళ్లవని హామీ ఇచ్చారు. ఈమేరకు హెజ్‌బొల్లా నాయకులతోను మాట్లాడినట్లు ట్రంప్‌ తెలిపారు. ఇజ్రాయెల్‌పై సైనిక కాల్పులను ఆపేందుకు వారు అంగీకరించినట్లు పేర్కొన్నారు. ఇజ్రాయెల్‌ కూడా వారిపై కాల్పులకు దూరంగా ఉంటుందని వెల్లడించారు. అయితే, నెతన్యాహు ప్రకటన ఇందుకు భిన్నంగా ఉంది. ఇజ్రాయెల్‌ నగరాలు, పౌరులపై దాడులు కొనసాగితే హెజ్‌బొల్లాను లక్ష్యంగా చేసుకుంటామని ఆయన పేర్కొన్నారు. ఈ విషయాన్ని ట్రంప్‌నకు కూడా తెలియజేసినట్లు పేర్కొన్నారు. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

International News News Keyword | Telugu Digital