translateexpand_more

Railway Land News

Latest updates from Telugu Digital news sources.

Namasthe Telangana03 Jun, 10:52 am
తాండూర్ లో భారీ బందోబస్తు మధ్య రైల్వే భూమి స్వాధీనం

తాండూర్, జూన్ 3 : మంచిర్యాల జిల్లా తాండూర్ మండలంలోని రేచిని రోడ్ రైల్వే స్టేషన్ సమీపంలో గల భూమిని బుధవారం రైల్వే అధికారులు స్వాధీనం చేసుకున్నారు. తెల్లవారు జామున బెల్లంపల్లి రైల్వే ఇంజినీరింగ్ అధికారులు జీసీబీలు, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్, సివిల్ పోలీసులతో కలిసి పెద్ద ఎత్తున రైల్వే సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని రైల్వే శాఖకు ఓ ప్రైవేటు సంస్థకు మధ్య వివాదాస్పదంగా ఉన్న భూమి చుట్టూ గల హద్దులను, అందులోని కట్టడాలను తొలగించారు. నేషనల్ హైవేను ఆనుకొని నిర్మాణంలో ఉన్న ఓ కట్టడాన్ని సైతం కూల్చివేశారు. పెద్ద ఎత్తున రైల్వే అధికారులు, పోలీసులు, రైల్వే సిబ్బంది ఈ కూల్చివేతల్లో పాల్గొనడం మండల వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇది చూసేందుకు స్థానికులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. సుమారు నాలుగు గంటల పాటు ఏక బిగిన రైల్వే అధికారులు తొలగింపు కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ ఘటనపై బెల్లంపల్లి రైల్వే శాఖ కు చెందిన ఓ ఇంజినీరింగ్ అధికారిని వివరణ కోరగా రైల్వే ఆస్తులను కాపాడుకోవడం నిత్య చర్యల్లో భాగంగా తొలగించామన్నారు. గతంలో ఈ భూమిపై కోర్టు స్టే ఆర్డర్ ఉన్నదని, ప్రస్తుతం అది తొలగిపోయిందన్నారు. కోర్టు ఆదేశాల మేరకే ఈ భూమిని రైల్వే శాఖ స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు. ఇందులో పెద్ద ప్రత్యేక విషయం ఏమీ లేదని కొట్టిపారేశారు. ఈ తొలగింపుల్లో బెల్లంపల్లి రైల్వే ఇంజనీరింగ్ శాఖ అధికారులతో పాటు తాండూర్ సీఐ దేవయ్య, తాండూర్, మాదారం తాళ్ల గురజాల ఎస్ఐలు ప్రసాదరావు, సౌజన్య, రామకృష్ణ, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Railway Land News Keyword | Telugu Digital