
రాజధాని అమరావతిపై వైసీపీ అధినేత జగన్ అనుసరిస్తున్న వైఖరిపై రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధాని ప్రాంతంలో పర్యటించిన ఆయన.. అమరావతి గురించి జగన్ చేస్తున్న వ్యాఖ్యలు పూర్తిగా బాధ్యతారాహిత్యమైనవని మండిపడ్డారు. ప్రపంచ స్థాయి రాజధానిని ఐదేళ్ల పాలనలో అల్లకల్లోలం చేసింది గత వైసీపీ ప్రభుత్వమేనని తెలిపారు. మూడు రాజధానుల పేరుతో రాష్ట్రాన్ని అయోమయంలోకి నెట్టి, రాజధాని నిర్మాణాన్ని అర్ధాంతరంగా నిలిపివేసి.. ఇప్పుడు అభివృద్ధిపై నీతులు చెప్పడం విడ్డూరంగా ఉందంటూ జగన్ తీరును ఎండగట్టారు.అమరావతికి భూములు ఇచ్చిన రైతుల విశ్వాసాన్ని దెబ్బతీసి, వేలాది కుటుంబాలను గత వైసీపీ ప్రభుత్వం ఇబ్బందులకు గురిచేసిందని విమర్శించారు. ఐదేళ్లు అధికారంలో ఉండి ఒక్క అడుగు కూడా ముందుకు వేయకుండా, ఇప్పుడు అసత్యాలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ధ్వజమెత్తారు. రాజధాని అభివృద్ధిని అడ్డుకున్న వారే అవినీతి గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. జగన్ చేసిన విధ్వంసాన్ని సరిదిద్దుతూ, నిలిచిపోయిన పనులను కూటమి ప్రభుత్వం తిరిగి ప్రారంభించిందని వివరించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి అమరావతిని ప్రపంచ స్థాయి రాజధానిగా, రాష్ట్ర గౌరవ ప్రతీకగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా వేగంగా అడుగులు వేస్తున్నాయని స్పష్టం చేశారు. రైతుల ఆకాంక్షలకు అనుగుణంగా రాజధాని నిర్మాణం కొనసాగుతుందని, దీనిపై జగన్ రాజకీయాలు చేయడం మానుకోవాలని మంత్రి హితవు పలికారు.