translateexpand_more

Telangana Four Lane Highway News

Latest updates from Telugu Digital news sources.

Asianet News Telugu03 Jun, 04:55 pm
రూ. 7500 కోట్లతో భారీ ప్రాజెక్ట్.. తెలంగాణలో ఈ ప్రాంత రూపురేఖలు మారడం ఖాయం

ప్రస్తుతం జాతీయ రహదారి-63లో భాగమైన ఆర్మూర్-జగిత్యాల-మంచిర్యాల మార్గాన్ని నాలుగు లేన్ల రహదారిగా అభివృద్ధి చేయనున్నారు. నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల జిల్లాల గుండా సాగే ఈ మార్గంలో రోజురోజుకు ట్రాఫిక్ ఒత్తిడి పెరుగుతోంది. అంక్సాపూర్, కోరుట్ల, జగిత్యాల, ధర్మపురి, లక్షెట్టిపేట వంటి పట్టణాల గుండా వెళ్లే ఈ రూట్‌లో తరచూ వాహన రద్దీ కనిపిస్తోంది. దీనిని దృష్టిలో ఉంచుకుని హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ (HAM) ద్వారా ఆధునిక ప్రమాణాలతో కొత్త రహదారిని నిర్మించనున్నారు. జాతీయ రహదారి-563లోని జగిత్యాల-కరీంనగర్ మార్గాన్ని కూడా నాలుగు లేన్ల హైవేగా మార్చనున్నారు. ఈ మార్గం జగిత్యాల, పోతారం, గంగాధర, కరీంనగర్ వంటి రద్దీ ప్రాంతాల గుండా వెళ్తుంది. బిల్డ్-ఆపరేట్-ట్రాన్స్‌ఫర్ (BOT-Toll) విధానంలో చేపట్టనున్న ఈ ప్రాజెక్టు వల్ల వాహన రాకపోకలు మరింత వేగవంతం కానున్నాయి. జనసాంద్రత అధికంగా ఉన్న ప్రాంతాల్లో బైపాస్ రోడ్లను నిర్మించి ట్రాఫిక్ సమస్యలను తగ్గించనున్నారు. కొత్త హైవేలు అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రయాణికులకు గణనీయమైన ప్రయోజనం కలగనుంది. ఆర్మూర్ నుంచి మంచిర్యాల వరకు ప్రస్తుతం తీసుకునే సమయంతో పోలిస్తే దాదాపు గంటన్నర వరకు ఆదా కానుంది. అలాగే జగిత్యాల నుంచి కరీంనగర్ చేరుకునేందుకు ప్రస్తుతం కంటే సుమారు 45 నిమిషాలు తక్కువ సమయం పడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అంతేకాకుండా గంటకు 100 కిలోమీటర్ల వేగంతో వాహనాలు ప్రయాణించేలా డిజైన్ రూపొందిస్తున్నారు. దీంతో ఇంధన వినియోగం తగ్గడంతో పాటు వాహనాల నిర్వహణ ఖర్చులు కూడా తగ్గనున్నాయి. కార్బన్ ఉద్గారాలు తగ్గి పర్యావరణానికి మేలు జరుగుతుందని భావిస్తున్నారు. ఈ రహదారుల విస్తరణ కేవలం ప్రయాణ సౌకర్యానికే పరిమితం కాదు. తెలంగాణలోని పలు ఆర్థిక, పారిశ్రామిక, పర్యాటక కేంద్రాలకు కొత్త ఊపును ఇవ్వనుంది. సిద్దిపేట, వరంగల్ ప్రాంతాల్లోని ప్రత్యేక ఆర్థిక మండలాలు, నిజామాబాద్, సిద్దిపేట మెగా ఫుడ్ పార్కులు, రాజన్న సిరిసిల్ల సీఫుడ్ క్లస్టర్లకు రవాణా మరింత సులభం కానుంది. అలాగే వేములవాడ రాజరాజేశ్వరస్వామి ఆలయం, కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయం, ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం, కాళేశ్వరం వంటి ప్రముఖ పుణ్యక్షేత్రాలకు వెళ్లే భక్తులకు ప్రయాణం సౌకర్యవంతంగా మారనుంది. నగునూరు కోట, ఖిల్లా కోట, లోయర్ మానేరు డ్యామ్ వంటి పర్యాటక ప్రాంతాలకు కూడా కనెక్టివిటీ మెరుగుపడుతుంది. ఈ భారీ రహదారి ప్రాజెక్టులు నిర్మాణ దశలోనే వేలాది మందికి ఉపాధి అవకాశాలు కల్పించనున్నాయి. కేంద్ర ప్రభుత్వ అంచనాల ప్రకారం ప్రత్యక్షంగా 34.43 లక్షల పనిదినాలు, పరోక్షంగా 42.7 లక్షల పనిదినాలు లభించనున్నాయి. ఇక నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్, మంచిర్యాల జిల్లాల్లో పరిశ్రమలు, వాణిజ్య కార్యకలాపాలు వేగం పుంజుకునే అవకాశం ఉంది. రైల్వే స్టేషన్లు, పారిశ్రామిక కేంద్రాలు, పర్యాటక ప్రాంతాల మధ్య అనుసంధానం పెరగడంతో ఉత్తర తెలంగాణ ఆర్థికాభివృద్ధికి ఈ ప్రాజెక్టులు కీలకంగా మారనున్నాయి. మొత్తంగా చూస్తే, రూ.7,597 కోట్లతో చేపట్టనున్న ఈ జాతీయ రహదారుల విస్తరణ తెలంగాణ రవాణా రంగంలో కొత్త అధ్యాయానికి నాంది పలకనుంది. ప్రయాణ సమయం తగ్గడం నుంచి ఉపాధి అవకాశాల పెరుగుదల వరకు అనేక ప్రయోజనాలు ఈ ప్రాజెక్టుల ద్వారా రాష్ట్రానికి దక్కనున్నాయి.