
జూలూరుపాడు, జూన్ 02 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల కేంద్రంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీ జూలూరుపాడు మండల అధ్యక్షుడు చాపలమడుగు రామ్మూర్తి ఆధ్వర్యంలో స్థానిక సీనియర్ నాయకులు యల్లంకి సత్యనారాయణ నివాసం వద్ద ఈ వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా యల్లంకి సత్యనారాయణ జాతీయ జెండాను ఆవిష్కరించగా, పార్టీ సీనియర్ నాయకులు యదలపల్లి వీరభద్రం బీఆర్ఎస్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆరు దశాబ్దాల పాటు ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం సాగిన ఉద్యమ ఫలితంగా ఏర్పడిన తెలంగాణ నేడు అభివృద్ధి పథంలో దూసుకుపోతోందన్నారు. బీఆర్‌ఎస్ పార్టీ తొమ్మిదిన్నర సంవత్సరాల పాలనలో రాష్ట్రం అభివృద్ధికి చిరునామాగా మారిందని తెలిపారు. అనంతరం ముఖ్య అతిథిగా హాజరైన లకావత్ గిరిబాబు మాట్లాడుతూ.. ఉద్యమ తెలంగాణ నేడు ఉజ్వల తెలంగాణగా రూపుదిద్దుకుందని హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నాయకత్వంలో మౌలిక సదుపాయాలు, సంక్షేమ పథకాలు, పరిపాలనా రంగాల్లో కొత్త రాష్ట్రం విశేష పురోగతి సాధించిందని కొనియాడారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం కీలక పాత్ర పోషించిందని, రాష్ట్ర అభివృద్ధి మోడల్ దేశానికే ఆదర్శంగా నిలిచిందని ఆయన అన్నారు. ఈ వేడుకల్లో పార్టీ నాయకులు దుద్దుకూరి నాగేశ్వరరావు, భూక్యా సేవా, భూక్యా జోహార్ లాల్, యల్లంకి సత్యనారాయణ , సాయిన్ని హరీష్, తాళ్లూరి రామారావు, పురస్తపురవు రామకృష్ణ, బండారి వెంకయ్య, లేళ్ల సీతయ్య, ధర్మరాజుల నరసింహారావు, నిమ్మటూరి కనకయ్య, పొన్నెబోయిన పుల్లయ్య, నూతి నరసింహారావు, బానోత్ హనుమంతరావు, ఈసం వెంకటేశ్వర్లు, మోదుగు నరసింహారావు, పోతురాజు కృష్ణ, ఉప సర్పంచులు బాదావత్ నరేష్, నూనావత్ నవీన్, కుంజా రవిలతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జూలూరుపాడులో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు