translateexpand_more

Ipl 2027 Rules Change News

Latest updates from Telugu Digital news sources.

TV9 Telugu03 Jun, 03:04 am
ఇక ఊపిరి పీల్చుకోండయ్యా.. ఐపీఎల్ నుంచి ఆ తుగ్లక్’ రూల్ పర్మింనెట్ గా ఔట్

Impact Player Rule: ఐపీఎల్ ప్రేమికులకు బీసీసీఐ త్వరలోనే ఒక భారీ ఊరటనిచ్చే వార్త చెప్పబోతోంది. క్రికెట్ అసలు సిసలు మజాను దెబ్బతీస్తూ, తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న ‘ఇంపాక్ట్ ప్లేయర్’ నిబంధనకు శాశ్వతంగా స్వస్తి పలికేందుకు బోర్డు ముమ్మరంగా అడుగులు వేస్తోంది. సాక్షాత్తూ క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ సైతం ఈ నిబంధనపై పెదవి విరచడంతో, దీనిని ఐపీఎల్ నుంచి పూర్తిగా తొలగించేందుకు వేదిక సిద్ధమైంది. ముగిసిన ఐపీఎల్.. మొదలైన ప్రక్షాళన.. ఐపీఎల్ 2026 సీజన్ ముగిసి, గుజరాత్ టైటాన్స్‌పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వరుసగా రెండోసారి ఘన విజయం సాధించి కప్పును ముద్దాడిన సంగతి తెలిసిందే. అయితే, ఈ మెగా టోర్నీ ముగిసిన వెంటనే క్రికెట్ వర్గాల్లో ఒక పెద్ద మార్పుపై జోరుగా చర్చ సాగుతోంది. గత కొన్ని సీజన్లుగా తీవ్ర వివాదాలకు, విమర్శలకు కేంద్రబిందువుగా మారిన ‘ఇంపాక్ట్ ప్లేయర్’ నిబంధనను రాబోయే సీజన్ల నుంచి పూర్తిగా తీసేయాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) తీవ్రంగా యోచిస్తోంది. అభిమానుల నుంచి మొదలుకొని విరాట్ కోహ్లీ వంటి అగ్రశ్రేణి ఆటగాళ్ల వరకు అందరూ ఈ రూల్‌ను మొదటి నుంచి తప్పుబడుతూనే ఉన్నారు. ఇది కూడా చదవండి: బీసీసీఐ డేంజరస్ నిర్ణయం.. ఆ జోడీతో ప్రత్యర్థులకు మాస్ వార్నింగ్.. ఇకపై టార్గెట్ పవర్ ప్లేలోనే ఫినిష్..! ‘క్రికెట్ దేవుడి’ మాటతో కదిలిన బీసీసీఐ.. ఈ వివాదాస్పద నిబంధనపై ఇటీవల ఓ కార్యక్రమంలో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ చేసిన వ్యాఖ్యలు క్రికెట్ ప్రపంచంలో సంచలనం సృష్టించాయి. ఐపీఎల్ అందాన్ని, ఆట సమతుల్యతను దెబ్బతీస్తున్న ఈ ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధనను వెంటనే రద్దు చేయాలని సచిన్ బీసీసీఐకి బహిరంగంగానే విజ్ఞప్తి చేశారు. సచిన్ లాంటి మహామహుడు ఒక విషయంపై గళం విప్పితే బోర్డు ఊరికే ఉంటుందా? ఆ మాటకు విలువనిస్తూ రాబోయే ఐపీఎల్ 2027 సీజన్ కంటే ముందే ఈ నియమాన్ని చెత్తబుట్టలోకి విసిరేయాలని బీసీసీఐ నిర్ణయించినట్లు విశ్వసనీయ సమాచారం. ఇందులో భాగంగానే ఫ్రాంచైజీల యజమానులతో జులై 31న ఒక కీలక సమావేశాన్ని బోర్డు ఏర్పాటు చేసింది. చాలా జట్లు కూడా ఈ నిబంధన వల్ల ఆట సహజత్వం దెబ్బతింటుందని భావిస్తుండటంతో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. ఆల్ రౌండర్ల పాలిట శాపంగా మారిన నిబంధన.. అసలు ఈ ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన వల్ల జరుగుతున్న నష్టమేంటి? దీనివల్ల జట్లకు బ్యాటింగ్‌లో అదనంగా ఒక ఆటగాడిని వాడుకునే వెసులుబాటు దొరుకుతుంది. ఫలితంగా బ్యాటర్లు ఎలాంటి బాధ్యత లేకుండా విచ్చలవిడిగా హిట్టింగ్ చేస్తూ భారీ స్కోర్లు నమోదు చేస్తున్నారు. ఇది చూడటానికి బాగానే ఉన్నా, ఒకప్పటి క్రికెట్ నైపుణ్యాలను ఇది ఖూనీ చేస్తోంది. ముఖ్యంగా జట్టులో బౌలింగ్, బ్యాటింగ్ రెండూ చేయగల ఆల్రౌండర్ల ప్రాధాన్యతను ఈ రూల్ పూర్తిగా తగ్గించేసింది. అదనపు బ్యాటర్ లేదా బౌలర్ అందుబాటులోకి రావడంతో, ఆల్రౌండర్లను జట్లు పక్కన పెట్టేస్తున్నాయి. ఇది కూడా చదవండి: ఆ అవార్డు వైభవ్‌ది కాదు.. అసలైన అర్హుడు ఆయనే.. టీమిండియా మాజీ ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు వెలుగు చూడని యువ ప్రతిభ.. భారత జట్టుకు వెన్నెముక లాంటి వాషింగ్టన్ సుందర్ లాంటి అంతర్జాతీయ క్రికెటరే ఈ నిబంధన వల్ల గత రెండు సీజన్లలో కేవలం తొమ్మిది మ్యాచ్‌లకే పరిమితం కావలసి వచ్చింది. అంతకుముందు సీజన్లలో ఆయన పూర్తిస్థాయిలో ఆడేవాడు. అంతర్జాతీయ ఆటగాళ్ల పరిస్థితే ఇలా ఉంటే, ఇక దేశవాళీ క్రికెట్ నుంచి ఎదిగేందుకు ప్రయత్నిస్తున్న యువ ఆటగాళ్ల పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. ముంబై ఇండియన్స్‌కు చెందిన రాజ్ అంగద్ బావా, లక్నో సూపర్ జాయింట్స్ ఆటగాడు అర్జున్ టెండూల్కర్, షాబాజ్ అహ్మద్ లాంటి ఎందరో ప్రతిభావంతులు తుది జట్టులో స్థానం కోసం, మైదానంలో తమ సత్తా చాటుకునేందుకు తీవ్రంగా పోరాడాల్సి వస్తోంది. ఆటగాళ్ల సహజ సామర్థ్యాన్ని తొక్కిపెడుతున్న ఈ రూల్‌ను వీలైనంత త్వరగా రద్దు చేయడమే సరైన నిర్ణయమని విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు. మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..