
Janhvi Kapoor: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ - డైరెక్టర్ బుచ్చిబాబు కాంబినేషన్‌లో తెరకెక్కిన మోస్ట్ అవేటెడ్ మూవీ 'పెద్ది'. ఈ చిత్రం జూన్ 4న గ్రాండ్‌గా రిలీజ్ కాబోతోంది. ఈ క్రమంలో చిత్ర యూనిట్ వరుస ప్రెస్ మీట్లు, ఈవెంట్లతో ప్రమోషన్లను పీక్స్‌కు తీసుకువెళ్లింది. కాగా ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్న బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ గురించి డైరెక్టర్ బుచ్చిబాబు తాజాగా పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. జాన్వీ కపూర్‌కు తెలుగు భాషపై ఉన్న శ్రద్ధను, ఆమె సింప్లిసిటీని కొనియాడుతూ బుచ్చిబాబు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మా అసిస్టెంట్ డైరెక్టర్లను పట్టుకుని తెలుగు నేర్చుకుంది.. జాన్వీ కపూర్ ఎంత స్మార్ట్ అండ్ టాలెంటెడో చెప్తూ బుచ్చిబాబు ప్రశంసలు కురిపించారు. "జాన్వీ కపూర్ చాలా తెలివైనది. నిన్న జరిగిన ఈవెంట్‌లో తెలుగులో మాట్లాడడం కోసం ఆమె మా అసిస్టెంట్ డైరెక్టర్ల దగ్గర తెలుగు నేర్చుకుంది. లొకేషన్‌లోనే కాకుండా ప్రమోషన్లలోనూ ఆమె చూపిస్తున్న ఈ డెడికేషన్ నిజంగా గ్రేట్" అని బుచ్చిబాబు కొనియాడారు. అంతేకాదు ఈరోజు ప్రెస్ మీట్ ఉందనగానే జాన్వీ కపూర్ ఎంతో సరదాగా స్పందిస్తూ.. "ఈరోజు మళ్లీ ప్రెస్ మీట్ ఉందా.. నిన్నటితో నాకున్న తెలుగు అంతా అయిపోయింది" అని తనతో అన్నట్లు బుచ్చిబాబు నవ్వుతూ గుర్తుచేసుకున్నారు. శ్రీదేవి కూతురిని అనే పొగరు ఇసుమంత కూడా లేదు అతిలోక సుందరి శ్రీదేవి కూతురిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ, జాన్వీ కపూర్ లొకేషన్‌లో ఎంత ఒదిగి ఉంటుందో బుచ్చిబాబు వెల్లడించారు. "స్టార్ కిడ్ అనే అహంకారం, శ్రీదేవి గారి కూతురిని అనే పొగరు ఆమెలో ఇసుమంత కూడా కనిపించదు. అందరితో ఎంతో మర్యాదగా, వినయంగా ఉంటుంది" అని జాన్వీ రియల్ క్యారెక్టర్‌ను బుచ్చిబాబు రివీల్ చేశారు. గతంలో ఎన్టీఆర్ 'దేవర' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన జాన్వీ కపూర్, ఇప్పుడు రామ్ చరణ్ 'పెద్ది' చిత్రంలో ఉత్తరాంధ్ర బ్యాక్‌డ్రాప్‌కు తగ్గ పక్కా లోకల్ క్యారెక్టర్‌తో అలరించబోతోంది. ఈ చిత్రానికి ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండగా, కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్‌కుమార్, జగపతి బాబు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.






