translateexpand_more

Sewage News

Latest updates from Telugu Digital news sources.

Namasthe Telangana03 Jun, 08:03 am
దేవాలయాల పక్కనే మురుగు నీటి నిల్వలు

జూలూరుపాడు, జూన్ 03 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం వెంగన్నపాలెం గ్రామంలో పారిశుధ్య సమస్యలు రోజురోజుకూ తీవ్రమవుతున్నాయి. గ్రామంలోని శ్రీ భక్త ఆంజనేయ స్వామి దేవాలయం పక్కనే మురుగు నీరు నిల్వ ఉండటంతో తీవ్ర దుర్గంధం వెదజల్లుతోంది. దీంతో దేవాలయానికి వచ్చే భక్తులు, స్థానిక ప్రజలు, ఆ మార్గంలో రాకపోకలు సాగించే బాటసారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆధ్యాత్మిక వాతావరణం నెలకొనాల్సిన పవిత్ర ప్రదేశం పక్కనే మురుగు నీరు నిల్వ ఉండటం బాధాకరమని వారు పేర్కొంటున్నారు. సమస్యపై పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం పట్ల స్థానికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీంతో పాటు చండ్రుగొండ వెళ్లే రహదారి పక్కన ఉన్న ముత్యాలమ్మ తల్లి దేవాలయం ఎదుట కూడా మురుగు నీరు బీటీ రోడ్డుపైనే ప్రవహిస్తోంది. రహదారి పక్కన నిల్వైన మురుగు నీటిలో ప్లాస్టిక్ వ్యర్థాలు పేరుకుపోవడంతో పరిస్థితి మరింత దయనీయంగా మారింది. నిత్యం వందలాది మంది ప్రయాణికులు రాకపోకలు సాగించే రహదారిపైనే మురుగు నీరు ప్రవహిస్తున్నప్పటికీ సంబంధిత అధికారుల్లో ఎలాంటి చలనం కనిపించకపోవడం శోచ‌నీయమ‌ని స్థానికులు పేర్కొంటున్నారు. గ్రామంలో పారిశుధ్య నిర్వహణ పూర్తిగా గాడి తప్పిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. రోడ్ల వెంట చెత్తాచెదారం, ప్లాస్టిక్ వ్యర్థాలు పేరుకుపోవడం, మురుగు నీటి పారుదల వ్యవస్థ సక్రమంగా లేకపోవడం వల్ల గ్రామ పరిసరాలు అపరిశుభ్రంగా మారాయని ఆరోపిస్తున్నారు. మండల కేంద్రంలోనే ఇలాంటి సమస్యలు నెలకొన్నప్పటికీ నిత్యం ఈ ప్రాంతంలో తిరిగే అధికారులు స్పందించకపోవడంపై గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే మురుగు నీటి నిల్వలను తొలగించి, డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచడంతో పాటు ప్రత్యేక పారిశుధ్య చర్యలు చేపట్టాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

Sewage News Keyword | Telugu Digital