హైదరాబాద్, జూన్ 3: ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ కచ్చితంగా ఇక్కడి భూమి పుత్రుల జాగీరే అని స్పష్టం చేశారు. ఏపీ డిప్యూటీ సీఎంగా పవన్‌ను గౌరవిస్తామని.. సోదరుడిగా ఇంటికి వస్తే.. హైదరాబాద్ బిర్యానీ పెడతామన్నారు. అంతే కానీ.. తమ సచివాలయంలో కూర్చుంటామంటే కుదరదన్నారు. బుధవారం సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణకు OG కేసీఆర్ అని.. వేరే ఎవరూ అవసరం లేదన్నారు.

ప్రజలుగా కలసి ఉండాలని కోరుకున్నాం..

‘పవన్ కళ్యాణ్.. మీరు ఇక్కడకి రండి.. మీ కుటుంబాలు, వ్యాపారాలు ఇక్కడే ఉన్నాయి. ప్రాంతాలుగా విడిపోయినా.. ప్రజలుగా కలిసి ఉండాలని కోరుకున్నాం. ప్రాంతీయవాదం ఉగ్రవాదంతో సమానమని పవన్ అన్నారు. మద్రాసు నుంచి ఆంధ్రా వేరు పడాలని పొట్టి శ్రీరాములు పోరాడారు. అది కూడా ప్రాంతీయవాదమే అంటారా? మోదీ ప్రాంతీయవాదంతో.. తెలంగాణకు వచ్చిన పరిశ్రమలను తరలించుకుపోతున్నారు. జాతీయవాదం ముసుగులో ఆర్థిక పాంత్రీయవాదం చేయటం సరైందేనా? దీనికి పవన్ కల్యాణ్ సమాధానం చెప్తారా’ అని కేటీఆర్ ప్రశ్నించారు.

దేశంలో ఎవరైనా ఎక్కడైనా పోటీ చేయొచ్చు..

తెలంగాణలో జనసేన కొత్తగా చేసేదేముందని కేటీఆర్ అన్నారు. దేశభక్తి గురించి పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం తమకు లేదన్నారు. 2023 ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికల్లో కూడా జనసేన పోటీ చేసిందని గుర్తుచేశారు. 2018లో చంద్రబాబు కూడా పోటీ చేశారని తెలిపారు. ‘పవన్.. తెలంగాణలో పోటీ చేయండి.. ఎవరు వద్దంటున్నారు. ఇక్కడకు వచ్చి అన్యాయంగా మాట్లాడటం సరికాదు. నిజాం సర్కార్‌కు వ్యతిరేకంగా కమ్యూనిస్టులు కదం తొక్కిన నేల ఇది. ఆవిర్భావ దినోత్సవం రోజు విభజన తీరు సరిగా లేదని అంటున్నారు. తెలంగాణపై ఉల్టాపల్టా మాటలెందుకు? తెలంగాణ ఏర్పడినప్పుడు 11 రోజులు అన్నం తినలేదని చెప్పారు. తెలంగాణ ఆవిర్భావం రోజు పవన్ సభ పెడతానంటే ఎలా. పవన్ మీటింగ్‌ను అడ్డుకున్నది కాంగ్రెస్ ప్రభుత్వం’ అని తెలిపారు. వందల మంది బలిదానాల రక్తంతో తడిసిన నేల తెలంగాణ అని మాజీ మంత్రి అన్నారు. ఒకటికి రెండు సార్లు ఆలోచించి పవన్ మాట్లాడాలని హితవుపలికారు. ఈ దేశంలో ఎవరైనా ఎక్కడైనా పోటీ చేయొచ్చని తెలిపారు. ఎక్కడైతే పోటీ చేయాలనుకుంటున్నారో ఆ ప్రాంత ప్రజల మనోభావాలు తెలుసుకోవాలని కేటీఆర్ సూచించారు.

తెలంగాణ కథలో విలన్ కాంగ్రెస్..

పోరాటాలు, త్యాగాలు, బలిదానాలతో తెలంగాణ సాకారమైందని కేటీఆర్ అన్నారు.1956లో బలవంతంగా ఆంధ్ర, తెలంగాణను కలిపింది కాంగ్రెస్ అని విమర్శించారు.1969 ఉద్యమంలో 379 మంది ప్రాణాలను బలిగొన్నది కాంగ్రెస్సే అని ఆరోపించారు. తెలంగాణ ఉద్యమాలను కర్కశంగా అణిచివేసింది కాంగ్రెస్ అని విరుచుకుపడ్డారు. మలిదశ ఉద్యమంలో వేలాది మంది ప్రాణాలను బలిగొన్నది కాంగ్రెస్సే అని అన్నారు. తెలంగాణ కథలో నెంబర్ వన్ విలన్ కాంగ్రెస్సే అని.. తప్పని పరిస్థితుల్లో కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చిందని వ్యాఖ్యానించారు. కేసీఆర్ పోరాటం, దీక్ష లేకపోతే.. తెలంగాణ వచ్చేది కాదన్నారు. కేసీఆర్ హయాంలో శాంతిభద్రతలు అద్భుతంగా ఉన్నాయని చెప్పుకొచ్చారు.

కరోనా కంటే కాంగ్రెస్ ప్రమాదం..

తెలంగాణ కంటే ఎక్కువ అభివృద్ధి ఏ రాష్ట్రంలోనూ జరగలేదని మాజీ మంత్రి అన్నారు. కాంగ్రెస్, బీజేపీ నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా అని సవాల్ విసిరారు. అమలుకాని హామీలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు. రెండున్నరేళ్లలో కాంగ్రెస్ చేసిందేంటి అని ప్రశ్నించారు. అప్పులు చేయడంలో రేవంత్ ప్రభుత్వం రికార్డ్ సృష్టిస్తోందని అన్నారు. రెండున్నరేళ్లలో రేవంత్ ప్రభుత్వం రూ.4లక్షల కోట్ల అప్పులు చేసిందని తెలిపారు. అప్పులపై ఒక్కో మంత్రి.. ఒక్కో లెక్క చెబుతున్నారన్నారు. కరోనా కంటే కాంగ్రెస్ ప్రమాదమని ప్రజలకు అర్థమైందని కేటీఆర్ పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి..

ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడి ఇంట్లో ఏసీబీ సోదాలు

తెలంగాణకు నా మద్దతు సిద్ధాంతపరమే: పవన్ కల్యాణ్

Read Latest Telangana News And Telugu News