translateexpand_more

Latest Sports News News

Latest updates from Telugu Digital news sources.

Eenadu03 Jun, 11:07 am
ఆ మ్యాచ్ కే కాకుండా టోర్నీ మొత్తానికి హైప్ తీసుకురండి

ఇంటర్నెట్ డెస్క్: మహిళల టీ20 ప్రపంచ కప్‌ (Women's T20 World Cup 2026) జూన్ 12 నుంచి మొదలుకానుంది. జూన్ 14న బర్మింగ్‌హామ్‌లో భారత్, పాకిస్థాన్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌పై క్రికెట్ ఫ్యాన్స్‌లో ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో భారత జట్టు వైస్ కెప్టెన్ స్మృతి మంధాన (Smriti Mandhana) అభిమానులు, మీడియాకు ఓ విజ్ఞప్తి చేసింది. కేవలం భారత్, పాక్‌ మ్యాచ్‌కే హైప్‌ క్రియేట్ చేయొద్దని, టోర్నీ మొత్తానికి ఆదరణ వచ్చేలా ప్రచారం చేయాలని కోరింది. ‘‘2022 కామన్వెల్త్ గేమ్స్‌లో బర్మింగ్‌హామ్‌లో భారత్, పాక్ తలపడ్డాయి. ఆ మ్యాచ్ టిక్కెట్లన్నీ అమ్ముడయ్యాయి. కేవలం భారత్-పాకిస్థాన్ మ్యాచ్ గురించే కాకుండా మనం టీ20 ప్రపంచ కప్‌నకు కూడా మరింత ప్రచారం కల్పించాలని ఆశిస్తున్నాను. కేవలం ఒక మ్యాచ్‌కే మనం ప్రచారం కల్పించాల్సిన అవసరం లేదు. దానికి ఇప్పటికే చాలా ప్రచారం జరిగింది. అభిమానులు మద్దతు ఇస్తారని ఆశిస్తున్నా. వారి కోసం మేం మంచి ప్రదర్శన ఇవ్వగలమనే నమ్మకం ఉంది’’ అని మంధాన పేర్కొంది. టీ20 వరల్డ్ కప్‌లో గ్రూప్‌-ఎలో ఉన్న భారత్‌ లీగ్‌ దశలో తొలి మ్యాచ్‌ పాకిస్థాన్‌తో (జూన్ 14న) ఆడనుంది. 17న నెదర్లాండ్స్, 21న సౌతాఫ్రికా, 25న బంగ్లాదేశ్‌, 28న ఆస్ట్రేలియాతో టీమ్ఇండియా తలపడనుంది. ఇక, భారత జట్టు విషయానికొస్తే.. ఇటీవల ఇంగ్లాండ్‌తో జరిగిన మూడు టీ20ల సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో టీమ్ఇండియా నెగ్గింది. తర్వాత రెండు మ్యాచ్‌ల్లో ఓటమిపాలై సిరీస్‌ను చేజార్చుకుంది. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

Eenadu03 Jun, 05:40 am
అది ఫేక్ వీడియో

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రస్తుత ఏఐ యుగంలో ఏది నిజమో.. ఏది కల్పితమో తెలియని పరిస్థితి నెలకొంది. రాజస్థాన్‌ రాయల్స్‌ ఆటగాడు వైభవ్‌ సూర్యవంశీ.. టీమ్‌ఇండియా స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లీని చాలా నెమ్మదిగా ఆడతాడంటూ అవమానించేలా మాట్లాడినట్లున్న ఓ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. విరాట్‌ గురించి హర్షా భోగ్లే ఒక ప్రశ్న అడిగితే.. వైభవ్‌ దానికి సమాధానం ఇచ్చినట్లుగా ఉంది ఆ వీడియో. అయితే అది ఫేక్‌ వీడియో అని ప్రముఖ క్రికెట్‌ కామెంటేటర్‌ హర్షా భోగ్లే ‘ఎక్స్‌’ వేదికగా క్లారిటీ ఇచ్చాడు. ‘సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న ఆ వీడియో ఫేక్‌. అందులో వైభవ్‌ను మర్యాద తెలియనివాడిగా, అహంకారిగా చిత్రీకరించారు. నేను అతడిని ఆ ప్రశ్న అడగలేదు. అతడు కూడా అలాంటి సమాధానమేదీ ఇవ్వలేదు. క్రూరంగా, దురుద్దేశపూర్వకంగా ఇలా వీడియో క్రియేట్‌ చేశారు. తనతో మాట్లాడిన కొద్దిమందితో చాలా గౌరవంగా మాట్లాడే ఒక చిన్న పిల్లాడి విషయంలో ఇలా ప్రవర్తించడం మరింత దారుణం’ అని హర్షా భోగ్లే పేర్కొన్నాడు. ఇంతకీ ఆ ఫేక్‌ వీడియోలో ఏముందంటే.. ‘మీరు కూడా విరాట్‌ కోహ్లీలా క్రికెట్‌ ప్రపంచాన్ని ఓ రాజులా ఏలాలి అనుకుంటున్నారా?’ అని హర్షా భోగ్లే అడిగితే.. ‘నాకు విరాట్‌ భయ్యా అంటే ఇష్టం. కానీ నాకు అతడి రికార్డ్స్‌ అంటే ఇష్టం లేదు. అతడు చాలా నెమ్మదిగా హాఫ్‌ సెంచరీలు, సెంచరీలు చేస్తాడు..’ అని అన్నట్లుగా ఉంది. కానీ అదంతా ఫేక్‌ అని హర్షా భోగ్లే తేల్చిచెప్పాడు. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.