translateexpand_more

Pawan Kalyan News News

Latest updates from Telugu Digital news sources.

Andhra Jyothy02 Jun, 11:39 am
తెలంగాణలో జనసేన పోటీ చేస్తుంది

తెలంగాణలో జనసేన పార్టీ ఉంటుందని ఆ పార్టీ అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రకటించారు. తెలంగాణలో పోటీ చేస్తామని ఆయన కుండ బద్దలు కొట్టారు. హైదరాబాద్,జూన్02: తెలంగాణలో జనసేన పార్టీ ఉంటుందని ఆ పార్టీ అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రకటించారు. తెలంగాణలో పోటీ చేస్తామని ఆయన కుండ బద్దలు కొట్టారు. మంగళవారం జూబ్లీహిల్స్‌లోని జనసేన పార్టీ కార్యాలయంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. దేశంలో అంతర్భాగం తెలంగాణ అని స్పష్టం చేశారు. తెలంగాణను వ్యతిరేకించిన వారే.. పదవుల్లో ఉన్నారని.. ఎమ్మెల్యేలు అయ్యారని పవన్‌ కల్యాణ్ వివరించారు. తెలంగాణ అంటే గౌరవం ఉంది కనుకే కొండగట్టు ఆలయానికి కోట్ల రూపాయిలు విరాళంగా ఇచ్చామన్నారు పవన్ కల్యాణ్. మీ తాటాకు చప్పుళ్లకు జనసేన పార్టీ భయపడదన్నారు. భయపడేవాడినే అయితే పార్టీ పెడతానా? అని ప్రశ్నించారు. తెలంగాణకు ద్రోహం జరిగితే మొట్టమొదట గొంతులేపేది జనసేన పార్టీనే అని స్పష్టం చేశారు. ఏం చేసినా ఓట్ల కోసం కాదు.. తనకు తెలంగాణపై ప్రేమ, మమకారం ఉన్నాయన్నారు. గుంటూరులో టీఆర్ఎస్ కార్యాలయం పెడితే స్వాగతించామని ఏపీ డిప్యూటీ సీఎం గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లోనే కాదు.. ఇక్కడ ఏమైనా చేస్తే తాను సీఎం అయిపోతానా? అని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. తెలంగాణను తానెప్పుడు అవమానించాను? అని ఆయన స్థానిక నేతలను ప్రశ్నించారు. తన పీక కోసినా కూడా భయపడేది లేదన్నారు. తనకు రెచ్చగొట్టడం ఇష్టం లేదని తెలిపారు. తనను ఎన్ని తిట్టినా పట్టించుకోనన్నారు. తెలంగాణలో ఉపాధి లేకపోతే తాను కారణమా? అని రాజకీయ పార్టీల నాయకులను ఆయన సూటిగా నిలదీశారు. మద్రాస్‌లో ఉన్న చిత్రపరిశ్రమ ఇక్కడికి ఎలా వచ్చిందన్నారు. ఆంధ్రా వాళ్లను తిడుతుంటే వాళ్లు ఇక్కడెలా ఉంటారన్నారు. ఇంకెంతకాలం ఆంధ్రావాళ్లను తిడుతూ కాలక్షేపం చేస్తారంటూ తెలంగాణలోని నాయకులకు ఆయన సూటిగా ప్రశ్నించారు. సడెన్‌గా ఇక్కడికి రావొద్దంటే ఎలా అని ఆయన ప్రశ్నించారు. తెలంగాణలో ఏపీ కాంట్రాక్టర్లు బాగానే ఉన్నారన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై తనకు గౌరవం ఉందన్నారు. తాను చెరువును కబ్జా చేశానని కొందరు అంటున్నారని.. అలా చేస్తే తనను ఇక్కడ ఉండనిస్తారా? అని ఆయన సూటిగా నిలదీశారు. తన ఫామ్‌హౌస్‌ కబ్జా అని తేలిస్తే.. దానిని రాష్ట్ర ప్రభుత్వానికే రాసిస్తానన్నారు. గద్దర్‌తో తనకు చాలా సాన్నిహిత్యం ఉందని గుర్తు చేసుకున్నారు. రాజకీయాల్లోకి రాకముందే తనకు గద్దర్‌ తెలుసునన్నారు. గద్దర్‌ ఒంట్లో బుల్లెట్లు దిగినప్పుడు ఎందుకు మాట్లాడలేదని రాజకీయ పార్టీల నేతలను పవన్ కల్యాణ్ సూటిగా ప్రశ్నించారు. గద్దర్‌ తమ పార్టీ కార్యాలయానికి వచ్చేవారని గుర్తు చేశారు. గద్దర్‌ బతికున్నప్పుడు మీరంతా ఎక్కడున్నారు? అంటూ తనను ప్రశ్నిస్తున్న నేతలకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చురకలంటించారు. తెలంగాణ పోరాట స్ఫూర్తితో ఉత్తేజం పొందాం: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

Eenadu02 Jun, 11:28 am
మీ ఇష్టానికి మాట్లాడితే నేను భయపడాలా

హైదరాబాద్‌: తెలంగాణపై తనకు ఎంతో ప్రేమ ఉందని, అది రాజకీయాలకు అతీతమైందని జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) అన్నారు. తెలంగాణ ప్రజలు తనకు ఎన్నోసార్లు అండగా నిలిచారన్నారు. తెలంగాణ ప్రజలందరికీ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు చెప్పారు. జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. తనను బెదిరించిన వారికి హెచ్చరికలు జారీ చేశారు. ‘‘ఈ మధ్యన కొందరు నన్ను హైదరాబాద్‌లో ఎలా అడుగు పెడతావ్‌.. ఇక్కడ నీకేం పని అని అడుగుతున్నారు. అసలు మీరెవరయ్యా నన్ను బెదిరించడానికి..? బెదిరించే వాళ్ల అయ్య జాగీరా.. తెలంగాణ. మీ ఇష్టానికి మాట్లాడితే నేను భయపడాలా? నాపై దాడులు చేస్తామంటున్నారు కదా.. అందుకే నా అడ్రస్‌ తెలియాలనే ఇంటి వద్ద ప్రెస్‌మీట్‌ పెట్టా. నాకు తెలంగాణలో బెదిరింపుల కన్నా ఆంధ్రాలోనే బెదిరింపులు ఎక్కువ. తెలంగాణ యువతకు అద్భుతమైన అవకాశాలు రావాలని కోరుకొనే వ్యక్తిని నేను. ఆంధ్రాలో నన్ను తిరగనివ్వం అంటే వారాహి అనుమతి ఇచ్చింది తెలంగాణ ప్రజలే. నాకు ఎన్నో ఏళ్లుగా తెలంగాణ ప్రజలు అండగా నిలిచారు. జనసేనను తెలంగాణ నడిబొడ్డున ఏర్పాటు చేశాం’’ ‘‘తెలంగాణలో పార్టీ బలోపేతం చేయాలని మా నేతలు చాలా సార్లు అడిగారు. ఆంధ్రాలోనే అధికారం కోరుకోని వాడిని. తెలంగాణలో అధికారం ఎందుకు కోరుతాను. నాకు అధికారంపై ప్రేమకాదు.. మార్పుపైనే ప్రేమ. తెలంగాణ ప్రజలకు ఆంధ్రాపై విద్వేషం లేదు. తెలంగాణ ప్రజలు ద్వేషం పెంచుకుంటే ఒక్క ఏపీ వ్యక్తి కూడా ఇక్కడ ఉండేవారు కాదు. తెలంగాణ నలుమూలల నుంచి తిరిగిన వ్యక్తిని.. ఇప్పుడు నన్ను విమర్శించేవాళ్లు ఆదిలాబాద్‌ అడవుల్లో తిరగలేదు.. నేను తిరిగాను’’ ‘‘నేను తెలంగాణకు వ్యతిరేకిని కాదు.. విభజించిన తీరుకు మాత్రమే వ్యతిరేకిని. సామాజిక తెలంగాణ రావాలని చెప్పి మరీ వచ్చాను. పార్లమెంటు తలుపులు మూసి విభజించిన తీరు తప్పని చెప్పా. తెలంగాణ వ్యతిరేకం అని వైఎస్‌ చెప్పినా, ఆయనకు ఊడిగం చేశారు. బెదిరింపులకు లొంగిపోయేవాడిని కాదు.. నేను ఇప్పటివరకు ఒక్క తెలంగాణ నాయుకుడిని కూడా ఒక్క మాట అనలేదు. నాకు రెచ్చగొట్టడం ఇష్టంలేదు.. ఎన్నోసార్లు తగ్గి ఉన్నా. గద్దర్‌ బతికున్న రోజుల్లో మీరంతా ఎక్కడ ఉన్నారు? గద్దర్‌ వచ్చి తనకు బండి కొనివ్వాలంటే రెండు రోజుల్లో కొనిచ్చాను. గద్దర్‌ బతికి ఉన్న రోజుల్లో ఆయనకు మీరు ఏం చేశారు?ఒక విశ్లేషకుడి వ్యాఖ్యల వల్ల గొడవ మొదలైంది. ఆ విశ్లేషకుడిపై కేసులు పెట్టిన విషయం నాకు మొదట్లో తెలియదు. నాకు తెలిశాక కేసులు వద్దు వదిలేయమని చెప్పా. ఆ తర్వాత ప్రెస్‌క్లబ్‌లో ప్రెస్‌మీట్‌లు పెట్టి నన్ను తిట్టారు. తెలంగాణలో ప్రతి సమస్యకు ఆంధ్రావారే కారణమా’’ ‘‘ప్రత్యేక తెలంగాణ కోరుకున్న మర్రి చెన్నారెడ్డి వల్లే సినీ ఇండస్ట్రీ చెన్నై నుంచి హైదరాబాద్‌ వచ్చింది. తెలుగు ప్రజలు 50 ఏళ్లు కలిసి ఉన్న రాజధాని.. హైదరాబాద్‌. తెలంగాణకు అన్యాయం చేసిన పాలకులను ఉరితీసినా ఫర్వాలేదు. పాలకులు వేరు.. ప్రజలు వేరు.. పాలకులను తిట్టండి.. ప్రజలను కాదు. దేశంలో ఎన్నో ప్రాంతాల్లో తెలుగువారు ఉన్నారు. అక్కడకి ప్రజలు మన తెలుగు ప్రజల్ని పంపిస్తే మన పరిస్థితి ఏమిటి? నేను చెరువును ఆక్రమించుకున్నాననే ఆరోపణలు చేస్తున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి గారికి చెబుతున్నా.. ఒకవేళ నేను కబ్జా చేశానని నిరూపణ అయితే, స్వాధీనం చేసుకోండి. కేసీఆర్‌ బీఆర్‌ఎస్ పెట్టి.. ఏపీకి వచ్చినప్పుడు స్వాగతించా. జనసేన మాజీ నేతలను బీఆర్‌ఎస్‌లోకి తీసుకున్నా స్వాగతించా. కేవలం 2వేల మందితో సభ పెట్టుకుంటామంటే అనుమతి ఇవ్వరా? విశ్లేషకులు ఇష్టానుసారం మాట్లాడినా మా అభిప్రాయం చెప్పకూడదా? ఇలాంటి విశ్లేషకుల వల్లే కమ్యూనిజం చచ్చిపోయింది’’ ‘‘ఇప్పటి వరకు నిర్ణయించుకోలేదు. మీరు అంటున్నారు గనక చెబుతున్నా. తెలంగాణలో జనసేన ఉంటుంది. మేం ఇక్కడ పోటీ చేస్తాం. అవసరమైతే తెలంగాణలో నేనే తిరుగుతాను. మేమే తిరుగుతాం. ప్రతి సమస్య మీద మాట్లాడతాం. ప్రతి అన్యాయాన్ని ఎదుర్కొంటాం. నా తెలంగాణ భారతదేశంలో అంతర్భాగం. మీరు బెదిరిస్తే భయపడం. తెలంగాణను వ్యతిరేకించిన వారే పదవుల్లో కూర్చొన్నారు. వ్యతిరేకించినవారే ఎమ్మెల్యేలు అయ్యారు’’ అని పవన్‌ కల్యాణ్‌ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

Pawan Kalyan News News Keyword | Telugu Digital