
Harish Rao | తాను పార్టీ మారే వ్యక్తి అంటూ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సిద్దిపేట క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హరీశ్ రావు మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి చిల్లరాయన.. ఇప్పటికీ చాలా సార్లు చిల్లర మాటలు మాట్లాడిండు. ఆయన మాటకు అసలు ఓ క్రెడిబులిటీ ఉందా..? నాలుగు పార్టీలు మారినోడు.. రోజుకు నాలుగు అబద్దాలు మాట్లాడేటోడు. 400 అబద్దపు హామీలిచ్చి అడ్డదారిలో అధికారమెక్కినోడు. పంద్రాగస్టుకల్లా రుణమాఫీ చేస్తమని దేవుడి మీద ఒట్టు పెట్టి మాట తప్పినోడు. ఆయిల్‌ఫామ్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవం సందర్భంగా సిద్దిపేటకు వచ్చి45 రోజుల్లో 9 వేల కోట్లు రైతుల అకౌంట్లలో రైతు బంధు డబ్బులు వేస్తా అని మాట తప్పిన ఈ రేవంత్ రెడ్డి మాటలకు ఓ విలువ ఉన్నదా..? అని అన్నారు. అబద్దాలు చెప్పుడు.. అడ్డమైన మాటలు మాట్లాడుడు. అడ్డదారిలో అధికారాన్ని అనుభవించుడు. అబద్దాల గారడీతో కాలం వెళ్లదీసుడు తప్ప. నువ్వు చేసింది ఏమన్నా ఉన్నదా రేవంత్ రెడ్డి అని హరీశ్ రావు ప్రశ్నించారు. కనబడ్డ దేవుడి మీద ఒట్టు పెట్టి రుణమాఫీ ఎగబెట్టింది నువ్వు కాదా..? సిద్దిపేటకు వచ్చి 45 రోజుల్లో రైతు బంధు వేస్తా అని 65 రోజులైనా రైతు బంధు ఎగబెట్టింది నువ్వు కాదా…అసలు నాలుగు పార్టీలు మారింది నువ్వు.. పూటకో పార్టీ మారి ఏ ఎండకు ఆ గొడుకు పట్టే రేవంత్ రెడ్డి నా గురించి మాట్లాడుతడా..? నేనిప్పటికీ వందసార్లు చెప్పిన నా జీవితమంతా కేసీఆర్.. నేను బతికున్నంత కాలం బీఆర్‌ఎస్ అని వందసార్లు.. ఇంకా వందసార్లు చెప్తా. అసలు నీకు నా గురించి మాట్లాడే నైతిక హక్కుందా..?














