
హైదరాబాద్: పాఠశాల విద్యలో తెలంగాణ పనితీరు గణనీయంగా మెరుగుపడిందని కేంద్ర విద్యాశాఖ.. పెర్ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్ (PGI)లో పేర్కొనడం తమ ప్రభుత్వ రెండేళ్ల కృషికి నిదర్శనమని సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) అన్నారు. అభివృద్ధికి తొలి కొలమానం విద్య అని చెప్పారు. విద్య ఒక్కటే పేదరికాన్ని నిర్మూలించి, సమాజాన్ని జాగృతం చేయగలదని తాను బలంగా విశ్వసించినట్లు తెలిపారు. ఆ దిశగా ప్రజా ప్రభుత్వం నిరంతరం శ్రమిస్తోందని ‘ఎక్స్’లో పోస్టు చేశారు. ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా విద్యాశాఖ బాధ్యతలు స్వయంగా తీసుకుని.. రెండేళ్లుగా తెలంగాణ మోడల్ స్కూళ్ల ఏర్పాటు, నూతన ఉపాధ్యాయుల నియామకం, డిజిటల్ విద్యకు ప్రాధాన్యం, ప్రభుత్వ బడులకు ఉచిత విద్యుత్ సదుపాయం, ఇతర మౌలిక సదుపాయాల కల్పన, డ్రాపౌట్ల నియంత్రణ వంటి అంశాలపై బలమైన కార్యాచరణ చేపట్టినట్లు వివరించారు. పదేళ్లలో జరిగిన విద్య విధ్వంసం నుంచి విద్యా వికాస పునర్నిర్మాణానికి నడుం బిగించామన్నారు. తాజా ఫలితాలతో సంతృప్తి పడట్లేదని, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల నిర్మాణం పూర్తయి.. భవిష్యత్‌లో ఈ పాఠశాలలు దేశ విద్యా వ్యవస్థలో తెలంగాణ స్థానాన్ని నెంబర్ వన్‌గా నిలబెడతాయన్న విశ్వాసం ఉందన్నారు. ఆ లక్ష్య సాధన దిశగా కేంద్ర నివేదికలో పేర్కొన్న ఫలితాలు ప్రేరణ ఇచ్చాయని సీఎం తెలిపారు. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.




























