Eenadu01 Jun, 04:43 pm
తెలుగు వర్సిటీ వీసీ మునిరత్నం నాయుడుకు డాలస్‌లో ఘన సన్మానం టెక్సాస్ : రాజమహేంద్రవరంలోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య డి. మునిరత్నం నాయుడుకు డాలస్‌లో ఘన స్వాగతం లభించింది. వీసీగా పదవీ బాధ్యతలు చేపట్టిన అనంతరం తొలిసారి అమెరికా విచ్చేసిన ఆయనకు తానా ప్రపంచసాహిత్యవేదిక నిర్వాహకుడు డా. ప్రసాద్ తోటకూర అధ్యక్షతన శుక్రవారం అభినందన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా మునిరత్నం నాయుడు మాట్లాడుతూ.. అతి తక్కువ సమయంలో ఎంతో ఆత్మీయంగా డా. ప్రసాద్ తోటకూర ఏర్పాటు చేసిన సమావేశానికి కృతజ్ఞతలు తెలిపారు. తెలుగు ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచే డా. నందమూరి తారక రామారావు తన మానసపుత్రికగా తెలుగు విశ్వవిద్యాలయాన్ని నెలకొల్పారన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన అనంతరం రాజమహేంద్రవరం కేంద్రంగా పొట్టి శ్రీ రాములు తెలుగు విశ్వవిద్యాలయం అదే పేరుతో పునః ప్రారంభమైందని గుర్తు చేశారు. మూడు దశాబ్దాలకు పైగా ఈ వర్సిటీతో అనుబంధం ఉన్న కారణంగా ఏపీ ప్రభుత్వం తనను వీసీగా నియమించిందని తెలిపారు. ప్రభుత్వం, దాతల సహకారంతో ఏపీ సీఎం చంద్రబాబు పిలుపు మేరకు P-4 పద్ధతిలో పాత భవనాల స్థానంలో నూతన భవనాలను నిర్మించాల్సిన అవసరాన్ని ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. తెలుగు భాష, సాహిత్య, కీర్తి, ప్రతిభా పురస్కారాలు, స్మారకోపన్యాసాలు, ప్రతిభావంతులైన విద్యార్థులకు బంగారు పతకాలు ప్రదానం చేసేందుకు ఓ ‘శాశ్వత పురస్కార నిధి’ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ విశ్వవిద్యాలయ అభివృద్ధిలో ప్రవాసాంధ్రులు భాగస్వాములై సహకారం అందించాలంటూ ఆయన చేసిన విజ్ఞప్తికి పలువురు ప్రవాసాంధ్రులు స్పందించారు. ‘సాహితీ పురస్కారనిధికి’ - పూర్వ పార్లమెంట్ సభ్యులు ఆత్మచరణ్ రెడ్డి రూ.4 లక్షలు, ‘ప్రతిభా పురస్కారనిధికి’ - ప్రముఖ ప్రవాసాంధ్ర నాయకులు మురళి వెన్నం రూ.3.50 లక్షలు, ‘కీర్తి పురస్కారనిధికి’ – తానా పూర్వాధ్యక్షులు డా. ప్రసాద్ తోటకూర 2.50 లక్షలు చొప్పున విరాళాలను ప్రకటించారు. దాతలు ఒకసారి విరాళం ఇస్తే సరిపోతుందని, ఆ మొత్తాలను బ్యాంకులో ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసి వాటిపై వచ్చే వడ్డీతో ఏటా వివిధ విభాగాల్లో పురస్కారాలు అందజేస్తామని ప్రకటించిన వెంటనే పురస్కార నిధికి రూ.10లక్షలు విరాళం అందించిన ముగ్గురికీ వీసీ మునిరత్నం కృతజ్ఞతలు తెలిపారు. ఇంకా అనేక పురస్కారాలకు విరాళాలు అందించే అవకాశం దాతలకు ఉందన్నారు. అనంతరం తానా పూర్వాధ్యక్షులు డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ.. గత ఆరేళ్లుగా అంతర్జాతీయ స్థాయిలో అంతర్జాలంలో ప్రతి నెలా ఆఖరి ఆదివారం నిర్వహిస్తున్న సాహిత్యకార్యక్రమాల సంఖ్య 92కి చేరి ఆరేళ్లు పూర్తయిందన్నారు. కేవలం సాహిత్య సమావేశాలకే పరిమితం కాకుండా, సిరివెన్నెల కుటుంబసభ్యుల సహకారంతో పద్మశ్రీ సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి సమగ్ర సాహిత్యాన్ని ముద్రించడం, సిరివెన్నెల నిలువెత్తు కాంస్య విగ్రహాన్ని ప్రభుత్వ సహకారంతో అనకాపల్లిలో ఏర్పాటు చేయడం, మనసు ఫౌండేషన్, కొసరాజు కుటుంబసభ్యుల సహకారంతో జానపద కవిబ్రహ్మ కొసరాజు రాఘవయ్య చౌదరి సర్వలభ్య సాహిత్యాన్ని ముద్రించి అంగరంగ వైభవంగా ఆవిష్కరించుకోగలగడం తానా ప్రపంచ సాహిత్య వేదిక ప్రయాణంలో కొన్ని మైలురాళ్ళు అని చెప్పారు. ప్రస్తుతం పొట్టి శ్రీ రాములు తెలుగు విశ్వవిద్యాలయం భాగస్వామ్యంతో అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి సందర్భంగా 125 ఏళ్ళ తెలుగు కథాప్రస్థానం నుంచి 125 తెలుగు కథలను ఎంపికచేసి వాటిని ఆంగ్లంలోకి అనువదించే ప్రణాళికను చేపట్టామని డా. ప్రసాద్ తోటకూర, ఉపకులపతి ఆచార్య డా. మునిరత్నం నాయుడు ఒక సంయుక్త ప్రకటనలో తెలియజేశారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రవాసాంధ్రులు పొట్టి శ్రీ రాములు తెలుగు విశ్వవిద్యాలయ అభివృద్ధికి తోడ్పడాలని డా. ప్రసాద్ తోటకూర పిలుపునిచ్చారు. ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం అధ్యక్షురాలు మాధవి లోకిరెడ్డి, పూర్వ పార్లమెంట్ సభ్యులు ఆత్మచరణ్ రెడ్డి, డా. ప్రసాద్ తోటకూర ఈ ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న వారంతా తెలుగులో సంతకాలు చేసిన నిలువెత్తు మహాకవి శ్రీశ్రీ ‘మహా ప్రస్థానం’ గ్రంథాన్ని ఉపకులపతి ఆచార్య డా. డి. మునిరత్నం నాయుడు దంపతులకు బహుకరించి దుస్సాలువతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో మురళి వెన్నం. తాడిమేటి కళ్యాణి, రఘు, ఆనందమూర్తి, లలితామూర్తి కూచిభొట్ల, నాగరాజు, డా. బీరం సుందరరావు, సతీష్ బండారు, రమణ జువ్వాడి, అనంత్ మల్లవరపు, చినసత్యం వీర్నపు, చంద్ర కన్నెగంటి, NMS రెడ్డి, సుబ్రహ్మణ్యం జొన్నలగడ్డ, చంద్రహాస్ మద్దుకూరి, దయాకర్ మాడ, లక్షి పాలేటి, సమీర శ్రీపాద, ఆచార్య పర్వతనేని సుబ్బారావు, పర్వతనేని చాంద్, రాయవరం భాస్కర్, రాజా రెడ్డి, నాట్యాచార్యులు కేవీ సత్యనారాయణ, ఎంవిఎల్ ప్రసాద్, సురేష్ మండువ, రావు కల్వల, రాజశేఖర్ సూరిభొట్ల, శేషారావు బొడ్డు, రాజేష్ చెరుకుపల్లి, కమలాకర్ దేవరకొండ, తిరుమల రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం కావడానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ ప్రసాద్ తోటకూర ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు